Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


  హజ్జ్ చరిత్ర సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథాలలో నమోదు చేయబడిన ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమ్ మరియు ఇతరుల హదీసుల ఆధారంగా ‘అల్ల...

హజ్జ్ చరిత్ర

 

హజ్జ్ చరిత్ర


సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథాలలో నమోదు చేయబడిన ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమ్ మరియు ఇతరుల హదీసుల ఆధారంగా ‘అల్లాహ్ పవిత్ర గృహానికి చేసే హజ్జ్ యాత్ర’ అనేది ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలోని (మూలసిద్ధాంతాలలోని) ఒక మూలస్థంభమనే విషయంలో ప్రాచీన-ఆధునిక,పూర్వ-ప్రస్తుతపండితులు ఏకీభవిస్తున్నారనేది ముస్లింలందరికీ తెలుసు.

 


ప్రఖ్యాత హజ్జ్ ఆచరణలు 

ఇతర ఆరాధనలలో మాదిరిగా హజ్ లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఆచరణలు  ఉన్నాయి. అల్లాహ్ నిర్దేశించిన విధంగానే వీటిని ఆచరించవలసి ఉంది. ఉదాహరణకు–మీఖాత్ నుండి ఇహ్రామ్ స్థితిలోనికి ప్రవేశించటం, తవాఫ్(కాబా ప్రదక్షిణ), సఫా మరియు మర్వాల మధ్య సయీ చేయటం, అరఫా మైదానంలో నిలబడటం, ముజ్దలిఫా మైదానంలో రాత్రి గడపటం, జమరాత్ లో రాళ్ళు విసరటం, పశుబలి(ఖుర్బానీ) చేయటం మొదలైన ప్రఖ్యాత హజ్జ్ ఆచరణలు. వీటన్నింటినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం బోధనల ప్రకారమే  ఆచరించవలసి ఉన్నది. ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం యొక్క హజ్ యాత్రను వివరించే హదీసులు అనేకం ఉన్నాయి; ‘జాద్అల్మాద్’ అనే గ్రంథంలో ఇమాం ఇబ్నెఅల్ఖయ్యిమ్ మరియు‘అల్బిదాయహ్వల్నిహాయహ్’  అనే గ్రంథంలో అల్హాఫిజ్ ఇబ్నెకథీర్ ఈ హదీథులను సంకలనం చేసియున్నారు; అంతేకాక ఈ హదీసుల నుండి ఉద్భవించే హజ్ నియమ నిబంధనలను కూడా ఈ ఇద్దరు పండితులు వివరించినారు. ఈ నియమ నిబంధనలను నేర్చుకోవటంలో మరియు వాటిని ఆచరించటంలో ప్రతి ముస్లిం తప్పకుండా శ్రద్ధ చూపవలెను.

 

 

అల్లాహ్ను స్మరించడం

అల్లాహ్  స్మరణాన్ని, ధ్యానాన్నిస్థాపించటమే హజ్జ్ ఆచరణల యొక్క ప్రధాన ఉద్దేశ్యమని మనం గుర్తుంచుకోవలెను. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు.(ఖుర్ఆన్ వచనాల భావం యొక్క అనువాదం): 

 

(హజ్ కాలంలో)మీ ప్రభువు అనుగ్రహాలను (వ్యాపారం ద్వారా) అన్వేషిస్తే మీపై దోషమేమీ లేదు. అరఫా నుండి తరలిపోయినప్పుడు, ‘మష్అరిల్హరాం’(ముజ్దలిఫా) వద్ద అల్లాహ్ ను స్మరించండి. ఆయన మీకు నేర్పిన విధంగా ఆయనను స్మరించండి. నిశ్చయంగా, పూర్వం మీరు మార్గభ్రష్టులలోని వారిగా ఉండేవారు. ఆ తరువాత ప్రజలు ఎక్కడి నుండైతే తరలిపోతారో, అక్కడి నుండి మీరూ తరలిపొండి మరియు అల్లాహ్ యొక్క క్షమాభిక్షను వేడుకోండి. నిశ్చయంగా, అల్లాహ్ అమితంగా క్షమించేవాడూ, అపారకృపాశీలుడు. ఎప్పుడైతే మీరు మీ‘మనాసిక్’లు పూర్తి చేసుకుంటారో, అల్లాహ్ ను స్మరించండి- మీరు మీ పూర్వీకులను స్మరించినట్లుగా లేదా అంతకన్నా అధికంగా స్మరించండి. మరియు ప్రజలలో ఎవరైతే “ఓ మా ప్రభూ!మాకు ఈ లోకంలోనే ప్రసాదించు”అని అంటారో, వారికి పరలోకంలో ఎలాంటి భాగమూ ఉండదు. మరియు వారిలో మరికొందరు “ఓ మా ప్రభూ!మాకు ఇహలోకంలో మంచిని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. మరియు మమ్మల్నినరకాగ్ని శిక్ష నుండి కాపాడు.” అని అంటారో,అటువంటి వారికే తాము సంపాదించుకున్న దాని నుండి భాగం ఉంటుంది. మరియు అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతిశీఘ్రమైనవాడు. మరియు లెక్కించదగిన ఆ దినములలో అల్లాహ్ ను స్మరించండి. ఎవరైతే రెండు రోజులలోనే వెళ్ళడానికి త్వరపడతారో, అతనిపై ఎటువంటి దోషమూ లేదు మరియు ఎవరైతే ఆలస్యం చేస్తారో, అతనిపై కూడా ఎటువంటి దోషమూ లేదు– ఇది భయభక్తులు కలవారి కొరకు. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి మరియు తెలుసుకోండి- మీరంతా ఆయన వైపునకే సమీకరించబడతారు. [అల్ బఖరహ్ 2:198-203]

 

ఒక హదీసులో ఆయెషా రజియల్లాహుఅన్హా ఇలా ఉల్లేఖించినారు: “కేవలం అల్లాహ్  నామస్మరణాన్ని స్థాపించటం కొరకే కాబా గృహం చుట్టూ తవాఫ్(ప్రదక్షిణం) చేయటం, అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య సయీ(తిరగటం), జమరాత్లో రాళ్ళు విసరటం మొదలైనవి నిర్దేశింపబడినవి.” అల్బైహఖీ(5/145) దీనిని ‘ముల్లఖ్హదీసు’గా వర్గీకరించినారు మరియు ఇందులో కొంత బలహీనత ఉన్నప్పటికీ, ఈ హదీసును‘మర్ఫూహదీసు’గా ఉల్లేఖించినారు.

 

దైవభీతి

హజ్జ్ ఆచరణలను గౌరవించమనే అల్లాహ్ ఆజ్ఞలను ముస్లింలు మనస్పూర్తిగా పాటిస్తారు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: 

 

“అలాగే నిశ్చయంగా హృదయాలలో ఉన్న దైవభీతి వల్లనే అల్లాహ్ నియమించిన చిహ్నాలను గౌరవిస్తారు.” [అల్హజ్22:32] 

 

హజ్రే  అస్వద్

 బుఖారీ హదీసు గ్రంథంలోని ఒక హదీసులో ఇలా నమోదు చేయబడినది: ఉమర్ ఇబ్నెఖత్తాబ్ రజియల్లాహుఅన్హు దివ్యశిలను ముద్దాడి, దానితో ఇలా పలికినారు, “ప్రవక్త ముహమ్మద్ 

సల్లల్లాహుఅలైహివసల్లం నిన్ను ముద్దాడటాన్ని నేను గనుక చూసి ఉండకపోతే, నేను నిన్ను అస్సలు ముద్దు పెట్టుకునే వాడినే కాను.” 

 

హజ్జ్ ఆచరణలను చర్చిస్తూ మరియు వివరిస్తూ ఇబ్నెఅల్జౌజీ ఇలా అన్నారు:  

“ఈ ఆచరణల వెనుకనున్న చరిత్ర కనుమరుగయిపోయినది, కానీ వాటి నియమాలు మాత్రం అలాగే వాడుకలో నిలిచిపోయాయి. ఈ ఆచరణలు కొందరు దర్శకులను తికమకపెట్టవచ్చు. దీనికి కారణం వారికి ఆ ఆచరణల వెనుకనున్న కారణం తెలియకపోవటమే. అందువలన వారు హజ్ లోని కొన్ని ఆచరణల గురించి‘ దీనిలో అర్థంపర్థం లేదు.’అని పలుకుతుంటారు. హదీసు ఉల్లేఖనలు లభ్యమైనంత వరకు వాటికి గల కారణాలను నేను వివరించాను. ఇప్పుడు వాటి సరైన అర్థాలను వివరిస్తాను. 

 

సమర్ధించుకోదగ్గ మరియు తేలికగా అర్థం చేసుకోదగ్గ సరైన కారణంపైనే ఆరాధనల యొక్క అసలు పునాది ఆధారపడి ఉంటుందనేది ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం. అదేమిటంటే, దాసుడు తన యజమానికి సమర్పించుకోవటం మరియు సంపూర్ణ విధేయత చూపటం. ఆతని ప్రార్థనలలో ఇబాదహ్(ఆరాధన) అనే పదం యొక్క భావాన్ని ప్రదర్శించే వినమ్రత, వినయం మరియు సంపూర్ణ సమర్పణ ఉంటుంది. 

 

జకాహ్ దానం

జకాహ్ దానంలో(విధి దానంలో) బీదలపై చూపే దయ మరియు సహాయం ఇమిడి ఉన్నాయి. కాబట్టి దానర్థం తేటతెల్లంగా స్పష్టమవుతున్నది. 

 

ఉపవాసం

ఉపవాసం అంటే తను దాస్యం చేయవలసిన ఆ ఏకైక ఆరాధ్యునికి మాత్రమే విధేయత చూపటానికి వీలుగా తన స్వంత కోరికలను, వాంఛలను, అభిలాషను, ఇచ్ఛను అణచి వేసుకోవటం. 

 

కాబా గృహం

కాబాగృహాన్నిగౌరవించటం, దానిని దర్శించటం మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాల పవిత్రతను స్థాపించటం మొదలైనవి ఉత్తమ ఆచరణలు. చిత్తశుద్ధితో పరిశుభ్రంగా అక్కడకు చేరటమనేది ఒక దాసుడు సంపూర్ణ వినయవిధేయతలతో, వినమ్రతగా, అణుకువగా, నిరాడంబరంగా, నిగర్వంగా తన ప్రభువు వైపు మరలటాన్ని స్పష్టం చేస్తుంది. తను అర్థం చేసుకున్న మరియు తనను ప్రేరేవించిన ఆరాధనలను మానవుడు సునాయాసంగా ఆచరిస్తాడు. కాని పరిపూర్ణ సమర్పణ సాధించటం కొరకు మనం అర్థం చేసుకోలేని కొన్ని ఆరాధనలు పాటించవలసి ఉంటుంది. వాటి ఆచరణ మానవుడికి అంత సులభతరం కాకపోవచ్చు మరియు వాటిని అతను గ్రహించలేకపోవచ్చు. ఈ పరిస్థితిలో అల్లాహ్ ఆజ్ఞలకు విధేయత చూపటమనేది మాత్రమే మనల్ని అటుంవంటి ఆరాధనలు చేయటానికి ప్రేరేపిస్తుంది. ఇది అత్యుత్తమమైన వినమ్రత, అణుకువ మరియు సమర్పణ విధానం.” 

 

హజ్ ఆచరణలు

ఇది అర్థం అయినట్లయితే, ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం కంటే పూర్వపు హజ్ ఆచారాల చరిత్ర గురించి మనకు ఎక్కువగా తెలియదనే విషయంలో అంత ప్రాధాన్యత లేదనేది మనం అర్థం చేసుకోగలం. కొన్ని హజ్ ఆచరణల గురించి వివిధ గ్రంథాలలో తెలుపబడిన కొన్ని ఉల్లేఖనలను క్రింద తెలుపుచున్నాము: 

 

హజ్ ఎప్పుడు విధిగా చేయబడినదిహజ్ ఎప్పుడు ఆరంభమైనది?  

అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు : “మరియు ప్రజలకు హజ్ యాత్రను గురించి ప్రకటించు: వారు పాదాచారులుగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె(సవారీ) మీద, విశాల(దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు.” [అల్హజ్జ్22:27]

 

పవిత్ర యాత్ర

ఇబ్నెకసీర్ ఈ వచనాన్నివివరిస్తూ ఇలా తెలిపినారు(3/221)

దీని అర్థం ఏమిటంటే: “ ‘(ఓ ఇబ్రాహీం) ప్రజలకు హజ్ గురించి ప్రకటన చేయి, మేము నిన్ను ఆజ్ఞాపించి నిర్మింపజేసిన ఈ గృహం వైపునకు పవిత్ర యాత్ర చేయమని ప్రజలకు పిలుపు నివ్వు.’అనే అల్లాహ్ ఆదేశం విని, ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అంటారు ‘ఓ ప్రభు!నా పిలుపు అంత బిగ్గరగా లేదే. మరి అది ప్రజలకు ఎలా చేరగలదు?’ అల్లాహ్ ఇలా పలుకుతాడు “ప్రకటించు మరియు మేము దానిని ప్రజలకు చేర్చుతాము.” అప్పుడు ఆయన తన స్థానంలో నిలుచుని లేదా ఒక గుట్టపై నిలుచుని లేదా అస్సఫా అనే చిన్న కొండపై నిలుచుని లేదా కాబాకు అతి దగ్గరలోనున్న అబుఖుబైస్ అనే ఎతైన పర్వతంపై నిలుచుని గొంతెత్తి ఇలా ప్రకటించినాడు: “ఓ ప్రజలారా, మీ ప్రభువు ఒక గృహాన్ని ఎన్నుకున్నాడు, కాబట్టి దానిని దర్శించటానికై రండి.”

అప్పుడు అతని పిలుపును భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలకు చేరుకోవటానికి వీలుగా పర్వతాలు క్రిందకు వంగినాయి. ఆ పిలుపును ఆ సమయంలో భూమిపై ప్రాణంతో ఉన్న మానవులందరూ వినటమే కాక, ఇంకా జన్మించని తల్లి గర్భంలోని శిశువులు మరియు పురుషుని నడుములోని వీర్యబిందువులు కూడా విన్నాయని తెలుపబడినది. అతని పిలుపు విన్న మరియు అల్లాహ్ ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ–వారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ పట్టణంలో నివసిస్తున్నా, చెట్లనీడలలో లేదా గుడారాలలో నివసించే దేశదిమ్మరులైనా ‘లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ (హాజరయ్యాను, ఓ అల్లాహ్, హాజరయ్యాను)’అని పలుకుతూ ప్రళయ దినం వరకు తప్పక హజ్ యాత్ర చేయవలెను.”ఇబ్నెఅబ్బాస్, ముజాహిద్, ఇక్రిమాహ్, సయీద్ఇబ్నెజుబైర్ మరియు ఇతర ముందుతరం పండిత ముస్లిం ఉల్లేఖనల యొక్క సారాంశమిది.  మరియు అసలు విషయం అల్లాహ్ కే తెలుసు. 

 

హజ్ మాసం

ఇబ్నెఅల్జౌజీ తన పుస్తకం ‘ముథీర్ అల్ అజమ్ అల్సాకిన్(1/354)’లో పైన తెలిపిన విషయాలనే చాలా క్లుప్తంగా ఉల్లేఖించి, వాటిని ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం చరిత్ర(సీరత్) తెలిపిన ఉల్లేఖకులవిగా నమోదు చేసినారు.  

 

ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లంను ఈ భూమిపై పంపక ముందు హజ్ విధిగావించటం గురించిన చరిత్రకు సంబంధించిన విషయమిది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం కాలంలో హజ్ విధిగావింపబడిన సంవత్సరం గురించి పండితులలో విభిన్నఅభిప్రాయాలు ఉన్నాయి. కొందరు పండితులు 6వ హిజ్రీ సంవత్సరంలో అని, కొందరు, 7వ హిజ్రీ సంవత్సరంలో అని, కొందరు 9వ హిజ్రీ సంవత్సరంలో అని, మరికొందరు 10వ హిజ్రీ సంవత్సరంలో అని అంటారు. అయితే ఖచ్చితంగా ‘9వ లేదా10వ సంవత్సరంలో హజ్ విధిగావింపబడినది ’అని ఇమాం ఇబ్నె అల్ఖయ్యిమ్ అభిప్రాయపడుతున్నారు. తన ‘జాద్అల్మఆద్’ అనే పుస్తకంలో ఆయన ఇలా తెలిపినారు:  

 

“ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం మదీనాకు వలస వెళ్ళిన తరువాత, ‘వీడుకోలు హజ్’గా ప్రఖ్యాతి చెందిన హజ్ తప్ప ఇంకే హజ్ యాత్రా చేయలేదు మరియు అది10వ హిజ్రీ సంవత్సరంలో జరిగినది అనే విషయంలో పండితుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. హజ్ ఆదేశం అవతరించిన తరువాత, ఎలాంటి ఆలస్యం చేయకుండా హజ్ చేయటానికి ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం త్వరపడినారు. అయితే హజ్ ఆదేశం ఆయన చివరి దశలో అంటే 9 లేదా10 వ హిజ్రీ సంవత్సరంలో అవతరించినది. మరి అటువంటప్పుడు, ఆ ఆదేశం ముందుగానే అవతరించినా, దాని ఆచరణ మాత్రం9 లేదా10వ హిజ్రీ సంవత్సరం వరకు వాయిదా వేయబడినదని ఎవరైనా ఎలా నిరూపించగలరు? ఖుర్ఆన్ లోని మూడవ అధ్యాయమైన సూరహ్ ఆలె ఇమ్రాన్ యొక్క మొదటి భాగం రాయబార బృందాల(ఆమ్అల్ఉఫూద్) సంవత్సరంలో అవతరించినదని తెలుపుతున్నాము.

 

జిజియా పన్ను

ఆ సంవత్సరంలో నజరా ప్రాంతం నుండి ఒక రాయబార బృందం ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం వద్దకు వచ్చినది.

వారు జిజియా పన్ను చెల్లించే విధంగా ఆయన వారితో ఒడంబడిక చేసుకున్నారు మరియు జిజియా పన్నుగురించిన ఆదేశాలు తబూకు యుద్ధం జరిగిన 9వ హిజ్రీ సంవత్సరంలో సూరహ్ ఆలె ఇమ్రాన్ మొదటిభాగం అవతరించినప్పుడు అవతరించినవి. …” 

 

జాద్అల్మఆద్(3/595)లో ఇలా తెలుపబడినది- ఖుర్ఆన్ (3:97)

సూరహ్ ఆలె ఇమ్రాన్ లోని 97వ వచనంలో హజ్ విధిగావించపబడిన ఆదేశం ఇలా ఉన్నది : “మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర అల్లాహ్ కొరకు చేయటం విధిగావింపబడినది.”హజ్ యాత్ర విధిగావించబడినదనే ఆజ్ఞను ఈ వచనం తెలుపుతున్నది.

ఇది 9వ సంవత్సరం చివరి భాగంలో రాయబారబృందాల సంవత్సరంలో అవతరించినది. కాబట్టి హిజ్రీ 9వ సంవత్సరం చివరిలో హజ్ యాత్ర విధిగావించబడినది.

 

ప్రజలపై హజ్ విధిగావించబడినది

తన తఫ్సీర్లో(ఖుర్ఆన్ వివరణ గ్రంథం, 2/4/92భాగంలో) అల్ఖుర్తుబి ఇలా తెలిపినారు: హజ్ గురించి అరబ్బు ప్రజలకు ముందు నుండీ తెలుసు. ఇస్లాం వచ్చిన తరువాత, వారికి ముందు నుండీ తెలిసియున్న‘ప్రజలపై హజ్ విధిగావించబడినదే’ అనే విషయమే మరల వారికి తెలుపబడినది.” 

 

కాబా గృహం చుట్టూ తవాఫ్ (ఏడు సార్లు ప్రదక్షిణ) చేయటం: 

అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇబ్రాహీము మరియు ఇస్మాయీలులను ఇలా ఆదేశించాము “నా గృహాన్ని పరిశుద్ధపరచండి; దాని ప్రదక్షిణలు చేసేవారి కొరకు, ఏతేకాఫ్ పాటించేవారి కొరకు (ప్రార్థనలు మరియు ఆరాధనల నిమిత్తం తమను తాము ఏకాంతపరచుకునే వారి కొరకు), ఇంకా రుకూ- సజ్దాలు చేసేవారి కొరకు.”” [అల్ బఖరహ్ 2:125] 

 

కాబా గృహం చుట్టూ చేసే తవాఫ్- ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాలంలో తెలిసిన విషయమేనని ఈ వచనం సూచిస్తున్నది. 

 

రమల్

రమల్ అంటే దగ్గర దగ్గరగా అడుగులు వేస్తూ, త్వరత్వరగా, వడివడిగా నడిచే నడక. తవాఫ్ అల్ఖుదూమ్(ఆగమ తవాఫ్- మక్కా చేరగానే ప్రారంభంలో చేసేది) లో  ఇది పురుషుల కొరకు సున్నత్(ఉత్తమం), కానీ స్త్రీలకు కాదు. 

 

రమల్ ఎలా ప్రారంభమైనది

బుఖారీ హదీస్ గ్రంథంలో(2/469-470, 1602) మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో (2/991-992, 1262) ఇబ్నె ఉమర్ రజియల్లాహుఅన్హు ఉల్లేఖించిన హదీసులు ఇలా నమోదు చేయబడినాయి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం తన సహచరులతో రాగా, “యత్రిబ్ (మదీనా నగరం) జ్వరంతో బలహీన పడిపోయిన ప్రజలు వచ్చారు చూడండి.”అని ముష్రికులు (కాబా వద్దనున్నబహుదైవారాధకులు) అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం తవాఫ్

లోని మొదటి మూడు ప్రదక్షిణలలో వడివడిగా నడవమని (రమల్ చేయమని) ఆదేశించినారు.… ఇంకో ఉల్లేఖనంలో ఆయన ఇలా ఆదేశించారని నమోదు చేయబడినది, “మీ బలాన్ని ముష్రికులు చూసే (తెలుసుకునే) విధంగా వడివడిగా నడవండి.” 

 

జమ్ జమ్ పవిత్ర జలం మరియు అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య చేసే సయీ నడక

ఇబ్నెఅబ్బాస్ రజియల్లాహుఅన్హు ఉల్లేఖించిన హదీసు సహీహ్ బుఖారీలో ఇలా నమోదు చేయబడినది:  

కాబా మస్జిద్ వద్ద నేటి జమ్ జమ్ బావి సమీపంలోని ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఒక చెట్టు క్రింద ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన భార్య హాజిరాను మరియు ఆవిడ కుమారుడు ఇస్మాయీలును తీసుకువచ్చినారు. అప్పుడు ఇస్మాయీలు ఇంకా తల్లి పాలు త్రాగే పసికందు వయస్సులో ఉన్నారు. ఆ రోజులలో మక్కాలో నివసించే వారు కాదు మరియు అక్కడ నీరు కూడా లేకుండెను. ఒక తోలు సంచిలో కొన్ని ఖర్జురపు పళ్ళు మరియు ఒక తోలు సంచిలో కొంత నీరు వారికిచ్చి, అక్కడ వారిని వదిలిపెట్టి, ఆయన తిరుగుప్రయాణం మొదలుపెట్టినారు. ఇస్మాయీలు తల్లి ఆయన వెంటబడి, ఇలా పలికినిది, “ఓ ఇబ్రాహీమ్! ఏ మానవుడూ, ఏ వస్తువూ లేని ఈ లోయలో మమ్మల్ని వదిలి, నీవెక్కడికి వెళ్ళుతున్నావు?” ఇలా ఆవిడ అనేక సార్లు ఆయనను ప్రశ్నించినది. కానీ, ఆయన ఆవిడ వైపు అస్సలు చూడలేదు. ఇక చివరగా ఆవిడ ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలామును ఇలా ప్రశ్నించినది, “ఇలా చేయమని అల్లాహ్ నిన్ను ఆజ్ఞాపించినాడా?” దానికి ఆయన, “అవును.”అని జవాబిచ్చినారు. అప్పుడు ఆవిడ, “అలా అయితే, అల్లాహ్ మమ్మల్ని(కాపాడకుండా) వదిలివేయడు,”అని పలికి, వెనుదిరిగినది. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ముందుకు ప్రయాణం సాగించినారు. వారు కనిపించనంత దూరంలో ఉన్న అల్థానియహ్ అనే ప్రాంతానికి చేరుకున్న తరువాత ఆయన కాబా వైపునకు తిరిగి, రెండు చేతులెత్తి, దీనంగా అల్లాహ్ తో ఇలా వేడుకున్నాడు:  

“ఓ మా ప్రభూ! వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర కాబా గృహం దగ్గర పైరుపండని, ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను. ఓ మా ప్రభూ!వారిని అక్కడ నమాజు స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను, వారివైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చుము..[ఇబ్రాహీమ్14:37]

 

ఇస్మాయిలు తల్లి ఇస్మాయిలుకు పాలుపడుతూ, తానేమో తన వద్దనున్ననీరు త్రాగుతూ ఉండినది. కొన్నాళ్ళలోనే తోలుసంచిలోని నీరు మొత్తం ఖర్చయిపోయినవి. అప్పుడు ఆవిడకు మరియు ఆవిడ బిడ్డకూ దాహం వేయగా, ఆవిడ తన బిడ్డవైపు దీనంగా చూడసాగినది. ఇక బిడ్డ పరిస్థితి చూడలేక, అతడిని అక్కడే నేలపై పడుకోబెట్టి, దగ్గరలోని అస్సఫా కొండపైకి ఎక్కి, ఎవరైనా కనబడతారేమోనని లోయవైపునకు చూడసాగినది. కానీ, ఆవిడకు ఎవరూ కనబడలేదు. అప్పుడు అస్సఫా కొండ దిగి, లోయలోనికి వచ్చి, ఆపదలో మరియు కష్టంలో ఉన్న వ్యక్తివలే పరుగెత్తుతూ, లోయదాటి, అల్ మర్వా కొండపైకెక్కి, నలుదిక్కులా ఎవరైనా కనబడతారేమోనని చూడసాగింది. కానీ ఆవిడకు అక్కడ కూడా ఎవరూ కనబడలేదు. అలా ఆవిడ ఏడు సార్లు తిరిగినది(అస్సఫా మరియు అల్ మర్వాకొండల మధ్య ఏడు సార్లు పరుగెత్తినది). 

 

ఇబ్నెఅబ్బాస్రజియల్లాహుఅన్హు ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా తెలిపినారు, “ఇదియే వాటి మధ్య (అస్సఫా మరియు అల్ మర్వా కొండల మధ్య) ప్రజల సయీ (నడకకు ఆరంభం).” ఆవిడ చివరిసారిగా (ఏడవసారి) అల్ మర్వా పైకి చేరగానే, ఒక దివ్యవాణి విన్నది. తనకు తానే “ష్..ష్!”  అనుకుంటూ, ఏకాగ్రతతో దానిని ఆలకించటానికి ప్రయత్నించినది. ఆవిడకు మరల ఆ శబ్దం వినబడగానే, ఆ శబ్దం వచ్చిన దిశవైపునకు తిరిగి ఆవిడ ఇలా అన్నది, “ఓ, (నీవెవరివయినాగానీ)! నీవు నీ శబ్దాన్ని నాకు వినిపించావు; నాకు సహాయం చేసేదేమైనా నీ వద్ద ఉన్నదా?” అప్పుడు ఒక దైవదూత జమ్ జమ్ స్థలంలో నీటిధార ఉబికివచ్చే వరకు తన మడమతో(లేదా తన రెక్కతో) త్రవ్వటాన్నిఆవిడ చూసినది. వెంటనే ఆవిడ ఆ నీటిధార చుట్టూ తన చేతులతో అడ్డుకట్ట కట్టి, తోలుసంచిని నింపుకోవటం మొదలుపెట్టినది. ఆవిడ కొంత నీటిని నింపుకున్న తరువాత, ఆ ధార ఇంకా ముందుకు ప్రవహించసాగినది.

 

ఇబ్నెఅబ్బాస్ ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా తెలిపారు, “ఇస్మాయీలు తల్లిపై అల్లాహ్ అనుగ్రహం చూపు గాక! ఒకవేళ ఆవిడ జంీజం నీటిధారను ఆపటానికి ప్రయత్నించకుండా అలాగే వదిలి వేసినట్లయితే(ఆ నీటిని తన తోలుసంచిలో నింపుకోనట్లయితే) , అది భూమి ఉపరితలంపై ఒక నదివలే ప్రవహించి ఉండేది.” ఆయన మరల ఇలా పలికారు: “ఆ దైవదూత ఆవిడతో ఇలా అన్నాడు, ‘నిర్లక్ష్యంగా వదిలివేయబడతానేమోనని భయపడకు. ఎందుకంటే ఈ బాలుడు మరియు అతడి తండ్రిచే నిర్మింపబడే అల్లాహ్ యొక్క గృహం ఇది. మరియు అల్లాహ్ తన ప్రజలను ఎన్నడూ నిర్లక్ష్యం చెయ్యడు’…” 

 

ఇబ్నెఅల్జౌజీ తన పుస్తకం అల్అజమ్అల్సాకిన్(2/47)లో ఇలా తెలిపినారు: “ఇది ఎందుకు జమ్జమ్ అని పిలవబడుతున్నదనే కారణాన్నిఈ హదీసు వివరిస్తున్నది. ఎందుకంటే నీటి ధార ప్రవహించటం మొదలుపెట్టగానే, హాజిరా  దానిని నియంత్రించడానికి (అరబీలోజమ్మత్-గా) ప్రయత్నించినది. భాషా పండితుడైన ఇబ్నె ఫారిస్ ఇలా తెలిపినారు: జమమ్తుఅల్నాఖహ్ (నేను ఒంటెకు కళ్ళెం, పగ్గం వేశాను) అనే పదాల నుండి జమ్జమ్ వచ్చును. 

 

అరఫహ్ మైదానంలో నిలబడటం

యజీద్ ఇబ్నె షైబాన్ ఉల్లేఖనను అబూదావూద్ మరియు అత్తిర్మిజీ హదీసు గ్రంథాలు ఇలా నమోదు చేసాయి: అరఫ మైదానంలోని మౌఖిఫ్ (ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం నిలబడిన చోటు) అనే స్థలానికి దూరంగా మేము నిలబడి ఉండగా, ఇబ్నెమిర్బాఅల్ అన్సారీ మా వద్దకు వచ్చి, ఇలా పలికినారు, “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం యొక్క వార్తాహరుడిని. ఆయన మీకు ఇలా తెలుపమన్నారు: ‘మీరున్న చోటునే నిలబడండి. (ఇది కూడా నిలబడే స్థలమే), ఇక్కడనే మీ పితామహుడైన ఇబ్రాహీమ్ నిలబడినారు.’” తన సహీహ్ అబి దావూద్ లో అల్బానీ దీనిని సహీహ్ హదీసుగా వర్గీకరించినారు. 

 

హజ్ యొక్క అనేక ఆచరణలు ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాలంలో బోధించబడినవే. కానీ, మక్కా ముష్రికులు(బహుదైవారాధకులు) నిర్దేశింపబడని కొన్ని నూతన కల్పితాచారాలను హజ్ యాత్రకు  జతపరచినారు. ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ప్రవక్తగా పంపబడిన తరువాత, ఆయన వాటిని ఖండించి, అల్లాహ్ నిర్దేశించిన హజ్ ఆచరణలను వాటి అసలు రూపంలో మరల బోధించినారు. 

 

ఇది హజ్ చరిత్ర మరియు వాటి కొన్ని ఆచరణల చరిత్ర గురించిన సంక్షిప్త సమాచారం. మరికొన్ని వివరాలకు అల్హాఫిజ్అల్జౌజీ వ్రాసిన ‘ముథీర్ అల్ అజమ్అల్సాకిన్ఇలాఅష్రఫ్అల్అమాకిన్’ గ్రంథంలోని మొత్తం మొదటి భాగం మరియు రెండవ భాగం లోని ఆరంభపు అధ్యాయాలు చదవండి. 

 

అల్లాహ్ యే సర్వజ్ఞుడు.

0 coment�rios:

Popular Posts