Human Short Life

Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


పవిత్ర రమజాన్ నెల      మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రమజాన్ నెలలు వచ్చాయి. ‘ఇక ఈ సంవత్సరమైనా రమజాన్ నెలను అల్లాహ్ స్వీకరించే విధంగా గడపాలి’అ...


పవిత్ర రమజాన్ నెల    


మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రమజాన్ నెలలు వచ్చాయి. ‘ఇక ఈ సంవత్సరమైనా రమజాన్ నెలను అల్లాహ్ స్వీకరించే విధంగా గడపాలి’అనే ఆలోచన మనలో ప్రతి సంవత్సరం కలుగుతున్నది. కాని అజ్ఞానం, అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన ప్రతిసారి అటువంటి పుణ్యకాలాన్ని అల్లాహ్ ఇష్టపడే విధంగా కాకుండా మన ఇష్టానుసారమే గడిపాము. ఇన్షా అల్లాహ్ ఈ రమజాన్ అల్లాహ్ ప్రసన్నత పొందటానికి మన సాయశక్తుల ప్రయత్నం చేద్దాము..


 రమజాన్ నెలలో చేయకూడని పనులు  


ఈ పనులు చేసినట్లైతే పాపాత్ములై, అల్లాహ్ యొక్క కఠినశిక్షకు, అయిష్టతకు గురౌతారు

  • రమజాన్ నెలలో సరైన కారణం లేకుండా ఉపవాసాలు ఉండకపోవటం - ఘోరమైన పాపం
  • ఉపవాస విరమణ అంటే ఇఫ్తార్ సమయం కాకముందే పగటిపూట కావాలని తినటం, త్రాగటం, బలాన్నిచ్చే మందులు ఎక్కించుకోవటం  - ఘోరమైన పాపం
  • కావాలని వాంతి చేసుకోవటం - ఘోరమైన పాపం
  • మగవారు మస్జిద్ లో జమాత్ తో నమాజ్ చదవకపోవటం - ఘోరమైన పాపం
  • సిగరెట్టు త్రాగటం, మద్యం / మత్తుమందులు సేవించటం వంటి చెడు అలవాట్లు - ఘోరమైన పాపం
  • ఉపవాస సమయంలో సంభోగం జరపటం - ఘోరమైన పాపం (అలాంటి తప్పుకు ప్రాయశ్చితం 2నెలలు ఎడతెగకుండా ఉపవాసాలుండటం లేదా 60మంది పేదలకు     భోజనం పెట్టడం)
  • ఏతెకాఫ్ పాటిస్తున్నప్పుడు సంభోగం జరపటం - ఘోరమైన పాపం
  • పగలైనా, రాత్రైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా హస్తప్రయోగం చేసుకోవటం - ఘోరమైన పాపం
  • అబద్ధాలు చెప్పటం, తప్పుడు సాక్ష్యం ఇవ్వటం -  ఘోరమైన పాపం
  • ఉపవాసంలో కామోద్రేకం కలిగే విధంగా భార్యాభర్తలు సరసాలాడటం-ఘోరమైన పాపం
  • ఉపవాస సమయంలో అసభ్యకరంగా మాట్లాడటం - ఘోరమైన పాపం
  • సినిమాలు, టివీలలోని అశ్లీల దృశ్యాలను చూస్తూ కాలాన్ని వృధా చేయటం - ఘోరమైన పాపం
  • సహరీ భోజనం చేయకుండానే ఉపవాసముండటం - మంచిది కాదు
  • సమయం అవ్వగానే ఇఫ్తార్ చేయకుండా ఆలస్యం చేయటం - తగదు
  • ఇఫ్తార్ సమయంలో కబుర్లు చెప్పుకుంటూ గడపటం - తగదు
  • నిరుపయోగమైన సంభాషణలలో లేక వీడియో గేమ్ లు ఆడుతూ కాలక్షేపం చేయటం - తగదు
  • అనవసరపు వంటపనులలో, విందులు - వినోదాలలో సమయం గడపటం – తగదు

 

తప్పని సరిగా చేయవలసిన పనులు   


ఈ పనులు చేసినట్లైతే అల్లాహ్ ఆదేశాన్ని ఆచరించిన వారవుతారు.

  • చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందుతూ, తమను క్షమించమని అపార కృపాశీలుడైన అల్లాహ్ ను ఎక్కువగా వేడుకోవలెను.
  • మరణించిన మన పూర్వికుల తప్పులను, పాపాలను క్షమించమనివారిని కఠినాతికఠినమైన సమాధి శిక్షల నుండి మరియు నరకయాతనల నుండి కాపాడమని, వారికి స్వర్గలోకంలో ఉన్నత స్థానం ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవలెను.
  • యోగ్యులైన వారందరూ పూర్తి రమజాన్ నెలంతా ఉపవాసాలుండవలెను – తప్పనిసరి
  • మగవారు ఫరజ్ నమాజులను మస్జిద్ లో జమాత్ తో పూర్తి చేయటం - తప్పని సరి
  • స్త్రీలు సమయం కాగానే ఆలస్యం చేయక ఫరజ్ నమాజులను పూర్తి చేయటం - తప్పని సరి
  • సహరీ భోజనం చేయటం. వీలులేకపోతే కనీసం మంచినీళ్ళైనా త్రాగటం - మంచిది
  • ప్రతి ఒక్కరూ దివ్యఖుర్ఆన్ పఠించటానికి, వినటానికి,ఆ దివ్యజ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి, ఆచరణలో పెట్టే విధంగా జీవితాన్ని మలచుకోవటానికి ప్రయత్నించవలెను.
  • అల్లాహ్ ఇష్టపడే విధంగా రాత్రిపగలు గడపుతూమంచి అలవాట్లు అలవర్చుకోవలెను.

జకాతుల్ ఫితర్

రమజాన్ నెలలో తెలిసో తెలియకో జరిగే చిన్న చిన్న పొరపాట్ల ప్రాయశ్చితం చేసుకోవటానికి ఇవ్వబడిన  అవకాశమే జకాతుల్ ఫితర్ దానం. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయరాదు. దీనిని పండగ నమాజ్ కంటే ముందే నిరుపేదలకు చెల్లించవలెను. ఒకవేళ ఆలస్యం చేసి, పండుగ నమాజు తర్వాత చెల్లిస్తే అది మామూలు దానంగా మారిపోయి, ప్రత్యేక శుభాలను ప్రసాదించే అంటే ఉపవాసాలలో జరిగిన తప్పులకు ప్రాయశ్చితంగా మారే అవకాశాన్ని జకాతుల్ ఫిత్ర్ కోల్పోతుంది.

 

ఎక్కువ పుణ్యాలు లభించగల పనులు 


ఈ పనులు ఆచరిస్తే ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి, పాపాలను క్షమింప జేసుకోవటానికి మంచి అవకాశం. అల్లాహ్ అనుగ్రహం పొందటానికి ఇదొక గొప్ప అవకాశం. 

 

  • రమజాన్ నెలలో పూర్తిగా ఆరాధనలు చేసుకోవటానికి వీలుగా తమకు లభించే సెలవులను ఈ నెలలో  ఉపయోగించుకోవటం మంచిది.
  • తమ దగ్గర పనిచేసే వారికి ఉపవాసాలుండటానికి వీలుగా పని తగ్గించి, సౌకర్యాలు కలుగజేసినందుకు అధికారులకు, వ్యాపారవేత్తలకుఇంకా ఉత్తమమైన స్థానాలలో ఉన్నవారికి కూడా పుణ్యాo లభించును.
  • అవకాశముంటే ఉమ్రా చేసిఎక్కువ పుణ్యాo పొందటానికి ప్రయత్నించవలెను.
  • ఎవరైనా కారణం లేకుండా తిట్టినా, దుర్భాషలాడినా, అవమాన పరచినా సహనంతో ఓర్పు వహించవలెను. ఎట్టి పరిస్థితులలోను తిరిగి జవాబు ఇవ్వరాదు.
  • జకాత్ చెల్లింపులు పూర్తిచేయటానికి మంచి సమయం.
  • వీలయినంత ఎక్కువగా దానధర్మాలు చేయటానికి ప్రయత్నించవలెను. రమజాన్ నెలలో చేసే ప్రతి మంచి పనికి మిగిలిన నెలలలో కంటే 10నుండి 700రెట్లు ఎక్కువగా        పుణ్యాలు లభిస్తాయి.
  • వేకువ ఝామునే (రాత్రి 3వ భాగంలో) నిద్రలేచి ఖియాముల్లైల్ నమాజు చేస్తూ, ఖుర్ఆన్ పఠిస్తూ,   అల్లాహ్ క్షమాపణ వేడుకుంటూ సహరీ సమయం వరకు గడపవలెను.
  • ఇంట్లోని మహిళలను, పిల్లలను కూడా ఖయాముల్లైల్ (అంటే రాత్రి) ఆరాధనల కోసం నిద్రలేపవలెను.
  • ప్రతిసారి మస్జిద్ చేరగానే 2రకాతుల తహయ్యతుల్ మస్జిద్ నమాజ్ పూర్తిచేయాలి.
  • శుక్రవారం రోజున సూరయె కహఫ్ పఠించటం వలన ఎక్కువ పుణ్యాo లభించును.    
  •                   

రమజాన్ నెలలోని చివరి పది రాత్రులు మొత్తం సంవత్సరంలోని రాత్రులన్నింటి కంటే చాలా గొప్పవైనవి.   కారణం ఇందులోని లైలతుల్ ఖదర్ అనబడే (బేసి సంఖ్యలోని) ఒక రాత్రిలో చేసే ఆరాధనలు 1000నెలల ఆరాధనల  కంటే ఉన్నతమైనవని ఖుర్ఆన్ లోని 97వ సూరా ప్రకటిస్తున్నది. అది రమజాన్ నెలలోని 21, 23, 25, 27లేక 29వ రాత్రులలో ఏదో ఒక రాత్రి కావచ్చు. కాబట్టి 27వ రాత్రి మాత్రమే కాకుండా పైన పేర్కొన్న మిగిలిని రాత్రులలో కూడా వీలయినంత ఎక్కువగా ఆరాధనలు చేయవలెను.

 

ఆఖరి పది దినాలు మగవారు (జుమా నమాజు జరిగే) మస్జిద్ లో ఏతెకాఫ్ ఉండటం రమజాన్ నెలలోని  అత్యంత ప్రత్యేకమైన మరియు అతి గొప్పదైన ఆరాధనా విధానం. అన్ని రకాల ప్రజలు అంటే ధనవంతులు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, కటిక బీదవారు, అప్పుల్లో మునిగి ఉన్నవారు, పాపాల్లో జీవితం గడుతున్నవారు, ఎవరైనా గాని ఎటువంటి ఖర్చు చేయవలసిన అవసం లేకుండా పాటించగల మరియు అల్లాహ్ కు ఇష్టమైన, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చివరి వరకు వదలకుండా ప్రతి సంవత్సరం ఆచరించిన అతి గొప్ప ఆరాధనా విధానమే ఏతెకాఫ్.

 

లైలతుల్ ఖదర్ రాత్రిలో అంటే ఆఖరి బేసి సంఖ్య రాత్రులలో ఎక్కువగా ప్రార్థించవలసిన దుఆ -

 

అల్లాహుమ్మ   ఇన్నక   అఫ్వున్   తుహిబ్బుల్   అఫ్వ,ఫఅఫు  అన్ని

 

ఓ అల్లాహ్ ! నీవే అత్యంత క్షమా గుణం కలవాడివి, క్షమించటం ఇష్టపడే వాడివి కాబట్టి నన్ను క్షమించు.

 

ఓ అల్లాహ్ ! మానవులందరికీ నీ యొక్క ఏకైకత్వపు ప్రాధాన్యతను అర్థం చేసుకునేటట్లు చేయుగాక ! అసత్యం నుండి బయటకు తీసి సత్యం వైపుకు నడిచేటట్లు చేయుగాక ! సర్వలోక సృష్టికర్తవైన నీవు తెలిపిన మంచిని, పుణ్యాలను మాత్రమే మంచివిగా, పుణ్యామైనవిగా స్వీకరించేటట్లు చేయుగాక మరియు నీవు తెలిపిన చెడు, పాపాపు పనులకు దూరంగా ఉండేటట్లు చేయుగాక !

ఇస్లామీయ క్యాలెండర్ లేదా హిజ్రీ క్యాలెండర్ ఇస్లామీయ  లేదా హిజ్రీ క్యాలెండర్ చంద్రమాస క్యాలెండర్.ఇందులో పన్నెండు నెలలు ఉంటాయి.అవి చంద్రునిపై ...


ఇస్లామీయ క్యాలెండర్ లేదా హిజ్రీ క్యాలెండర్



ఇస్లామీయ లేదా హిజ్రీ క్యాలెండర్ చంద్రమాస క్యాలెండర్.ఇందులో పన్నెండు నెలలు ఉంటాయి.అవి చంద్రునిపై ఆధారపడి ఉంటాయి.ఇస్లామీయ క్యాలెండర్ సౌర / సూర్య క్యాలెండర్ కన్నా దాదాపు 10రోజులు తక్కువ ఉంటుంది.కావున ఇది గ్రేగోరియన్ క్యాలెండర్ తో మారుతూ ఉంటుంది. 

సంవత్సరాల పేర్లు

ఇస్లాం కంటే ముందు అరేబియాలో ఏదైనా ముఖ్య ఘటన జరిగిన దానిని బట్టి ఆ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకునేవారు.ఇస్లామీయ చరిత్ర ప్రకారం అబ్రహ అనే యమెన్ పాలకుడు కాబాను నాశనం చేయడానికి ఏనుగులతో దండెత్తి వచ్చాడు.ఆ దాడి అల్లాహ్ దయ వల్ల విజయవంతం కాలేదు.ఆ సంవత్సరం ఏనుగుల సంవత్సరంగా ప్రసిద్దిగాంచింది.అదే సంవత్సరం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జన్మించారు.ఎక్కువ శాతం ప్రజలు దీన్ని 570 CE అంటారు, కొందరు 571 CE అని అంటారు.

అబూ రేహాన్ అల్ బిరుని రహిముల్లాహ్ ప్రకారం హిజ్రీ క్యాలెండర్ లోని మొదటి పది సంవత్సరాలు లెక్కించబడలేదు, కాని అవి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాల ద్వారా ప్రసిద్ది చెందాయి.

  1. అనుమతి సంవత్సరం
     
  2. యుద్ధ నియమాల సంవత్సరం
     
  3. విచారణ సంవత్సరం
     
  4. పెళ్లిపై శుభాకాంక్షలు తెలిపే సంవత్సరం
     
  5. భూకంప సంవత్సరం
     
  6. విచారించే సంవత్సరం
     
  7. విజయం పొందిన సంవత్సరం
     
  8. సమానత్వపు సంవత్సరం
     
  9. మినహాయింపు సంవత్సరం
     
  10. వీడ్కోలు సంవత్సరం

 

638 CE (17 AH) లో అప్పటి ముస్లిం పాలకుడైన ఉమర్ రజిఅల్లాహుఅన్హు పర్యవేక్షణలో బస్రా అధికారి అయిన అబూ మూసా అషారి రజిఅల్లాహుఅన్హు ఫిర్యాదు చేశారు.అదేమనగా ఎన్నో సందేశాలలో/ఉత్తర్వులలో సంవత్సరమే వ్రాసిలేదు.దీని కారణంగా ఏది మొదటిదో,ఏది తరువాతదో తెలుసుకోవడం కష్టం అవుతుంది.ఈ ఫిర్యాదును సమంజసంగా భావించి ఉమర్ రజిఅల్లాహుఅన్హు,తన అనుయాయులతో ముస్లింల శకాన్ని, కాలాన్ని నిర్ణయించడం అవసరం అని అన్నారు. అందరితో సంప్రదించాక ఉమర్ రజిఅల్లాహుఅన్హు మొదటి సంవత్సరంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాకు వచ్చిన తేదీని చేర్చాలని నిర్ణయించారు. అప్పటి అరబ్బుల సంప్రదాయం ప్రకారం ముహర్రం నెలతో సంవత్సరం ఆరంభించడం మంచిదని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజిఅల్లాహుఅన్హు సూచించారు. వాస్తవానికి వలస (మక్కా నుండి మదీనా) జరిగింది సఫర్ మరియు రబీ ఉల్ అవ్వల్ లో అయినా, ఇస్లామీయ క్యాలెండర్ ముహార్రం నెలతో (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనా చేరిన సంవత్సరంతో) ప్రారంభమవడానికి కారణం ఇదే. హిజ్రా కారణంగా దాని పేరు హిజ్రా క్యాలెండర్ పడింది. అరబిక్ పదం హిజ్రా అంటే వలస వెళ్ళడం.

 

ఇస్లామీయ క్యాలెండర్ నెలలు

ఖుర్ఆన్ లో తెలిపినట్లుగా ఇస్లామీయ క్యాలెండర్ లో 12 నెలలు ఉన్నాయి: “నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. అయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగె సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి).....” ఖుర్ఆన్ సూరా తౌబా 9:36

 

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం12 నెలలు ఇవి:

  1. ముహర్రం
     
  2. సఫర్
     
  3. రబీ ఉల్ అవ్వల్
     
  4. రబీ ఉల్ ఆఖిర్
     
  5. జుమాదా అల్ ఊలా
     
  6. జుమాదా అల్ ఉఖ్రా
     
  7. రజబ్
     
  8. షాబాన్
     
  9. రమజాన్
     
  10. షవ్వాల్
     
  11. జిల్ ఖాదా
     
  12. జిల్ హిజ్జాహ్ 

 

పవిత్రమైన నెలలు

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ 12 నెలల గురించి చెబుతూ అందులో నాలుగు పవిత్రమైన నెలలు ఉన్నాయని అన్నాడు. వాటి పేర్లు హదీసులో ఇవ్వబడ్డాయి:

అబూ బకర్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. అందులో నాలుగు పవిత్రమైనవి. అవి వరుసగా వచ్చే మూడు –జిల్ ఖాదా, జిల్ హజ్జాహ్, ముహర్రం మరియు జుమాదా, షాబాన్ ల మధ్య వచ్చే రజబ్.” సహీహ్ బుఖారీ vol 4:419, 2958 (NE) మరియు అబూ దావూద్1942

  పవిత్ర మాసమైన ‘ముహర్రం’ శుభాలు అల్లాహ్ యొక్క పవిత్ర మాసమైన ముహర్రం మాసం దీవెనలతో కూడిన మరియు ఒక ప్రత్యేకమైన మాసం. ఇది హిజ్రీ క్యాలెండరులోన...

 

పవిత్ర మాసమైన ‘ముహర్రం’ శుభాలు


అల్లాహ్ యొక్క పవిత్ర మాసమైన ముహర్రం మాసం దీవెనలతో కూడిన మరియు ఒక ప్రత్యేకమైన మాసం. ఇది హిజ్రీ క్యాలెండరులోని మొదటి మాసం. ఇస్లామీయ సంవత్సరంలోని నాలుగు పవిత్ర మాసములలోని ఒక మాసం.

ఖుర్ఆన్ వెలుగులో

“నిశ్చయంగా, అల్లాహ్ దగ్గర నెలల సంఖ్య పన్నెండు, భూమ్యాకాశాలు సృష్టించినప్పుడే అల్లాహ్ దీనిని నిర్ణయించెను; వాటిలో నాలుగు పవిత్రమైనవి. అది సరైన ధర్మము, కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…” [ఖుర్ఆన్, సూరా తౌబా 9:36]

 

హదీసు వెలుగులో

అబూ బకర్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా ఉపదేశించినారు: “సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నాయి, వాటిలో నాలుగు పవిత్రమైనవి, వరుస క్రమంలోని మూడు–జుల్ ఖైదహ్, జుల్ హజ్జ్, ముహర్రం మరియు (నాలుగవది) రజబ్  ఏదైతే జుమాదా మరియు షాబాన్ మాసముల మధ్యలో వచ్చునో.” (బుఖారీ:2958)

 

ముహర్రం అనే పేరు దాని పవిత్రతను సూచిస్తున్నది మరియు ధృవపరుస్తున్నది

అల్లాహ్ యొక్క పదాలు (ఖుర్ఆన్ పదాల భావానికి అర్థం): “కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…”అంటే ఈ పవిత్ర మాసములలో మీరు స్వయంగా తప్పులు చేయవద్దు. ఎందుకంటే ఈ పవిత్ర మాసములలోని తప్పులు, పాపములు మిగిలిన మాసములలోని తప్పులు, పాపముల కంటే తీవ్రమైనవి.

 

“కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…”అనే పదముల గురించి ఇబ్నె అబ్బాస్ రజిఅల్లాహు అన్హు యొక్క అభిప్రాయం ఇలా ఉన్నది – ఈ ఆయత్ (వచనం) మొత్తం నెలల సంఖ్యను తెలియజేసి, ఆ తర్వాత ప్రత్యేకంగా వాటిలో నుండి ఈ నాలుగింటిని వేరు పరచి, వాటిని పవిత్రమైనవిగా ప్రకటించినది. కాబట్టి ఈ పవిత్ర మాసములలో చేసిన పాపము చాలా గంభీరమైనది మరియు తీవ్రమైనది. అలాగే ఈ మాసములలో చేసిన మంచి పనులు అనేక రెట్ల పుణ్యాలను సంపాదించి పెట్టును. 

 

“కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…”అనే ఆయత్ (వచనం) గురించి ఖతాదా అనే ఆయన ఇలా అభిప్రాయపడినారు – పవిత్ర మాసములలో చేసే తప్పుడు పనులు (గునాహ్) ఇతర మాసములలో చేసే తప్పుడు పనుల కంటే చాలా గంభీరమైనవి మరియు చాలా పాపాత్మకమైనవి. తప్పుడు పనులు చేయటం అనేది ఏ సమయంలోనైనా సరే పాపాత్మకమైనదే, కాని అల్లాహ్ తన ఇష్టానుసారం కొన్నింటిని ఎక్కువ గంభీరమైనవిగా ప్రకటించెను. అల్లాహ్ తన సృష్టిలో నుండి కొన్నింటిని ఎన్నుకొనెను. తన దైవదూతలలో కొందరిని వార్తాహరులుగా ఎన్నుకొనెను. అలాగే మానవులలో కొందరిని ప్రవక్తలుగా, సందేశహరులుగా ఎన్నుకొనెను. పలుకులలో కొన్నింటిని తన జికర్ (ధ్యానం) కోసం ప్రత్యేకింపబడిన పలుకులుగా ఎన్నుకొనెను. భూమండలంపై ఉన్న ప్రాంతాలలో మస్జిద్ ప్రాంతాలను పవిత్రమైనవిగా ఎన్నుకొనెను. మాసములలో రమదాన్ మాసాన్ని మరియు ఇతర పవిత్ర మాసాలను ఎన్నుకొనెను. వారంలో శుక్రవారాన్ని పవిత్రమైన దినంగా ఎన్నుకొనెను. దినములలో అరఫాహ్ దినాన్ని పవిత్రమైన దినంగా ఎన్నుకొనెను. రాత్రులలో లైలతుల్ ఖదర్ రాత్రిని పవిత్రమైన రాత్రిగా ఎన్నుకొనెను. కాబట్టి వేటినైతే ప్రత్యేకంగా గౌరవించమని అల్లాహ్ ప్రకటించెనో, వాటిని మనం తప్పకుండా గౌరవించవలెను. (తఫ్సీర్ ఇబ్నె కథీర్, ఖుర్ఆన్, సూరాతౌబా 9:36)

 

ముహర్రంలో నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలు ఎక్కువగా ఉండటం వలన లభించే శుభాలు

అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీస్ లో ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: ‘అల్లాహ్ యొక్క మాసమైన ముహర్రం మాసపు ఉపవాసము, రమజాన్ తర్వాతి ఉపవాసాలలో ఉత్తమమైనది.’ (ముస్లిం 1982)

 

వ్యాకరణ పరంగా అల్లాహ్ యొక్క మాసం” అనే పదాలు, ఈ మాసపు పేరును అల్లాహ్ యొక్క పేరుతో కలిసి రావటమనేది, ఈ నెల యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను, ప్రత్యేకతను సూచిస్తున్నది. అల్ ఖారీ ఇలా తెలిపారు: ముహర్రం మాసం మొత్తం పవిత్రమైనదే” అనేది దీనిలో ప్రదర్శితమవుతున్న అర్థం. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ మాసం తప్ప వేరే ఇతర ఏ మాసమూ పూర్తిగా ఉపవాసం ఉండలేదనేది నిరూపింపబడిన వాస్తవము. కాబట్టి, ఈ హదీస్ ముహర్రంలో ఎక్కువగా ఉపవాసాలు ఉండటాన్ని ప్రోత్సహిస్తున్నదని భావించవచ్చును. అంతేగాని ముహర్రం నెల మొత్తం ఉపవాసాలు ఉండమని కాదు. 

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ మాసంలో అధికంగా ఉపవాసాలు ఉండేవారని వేరే హదీస్ లలో నమోదు చేయబడినది. ముహర్రం మాసం యొక్క పవిత్రత గురించి అల్లాహ్ యొక్క ఆదేశములు వారి చివరి దినముల వరకు అవతరించి ఉండక పోవచ్చును మరియు ఆ ఆదేశముల తర్వాత మరుసటి ముహర్రం మాసం వచ్చేలోగానే ఆయన మరణించి ఉండవచ్చును. (షరహ్ అన్నవావి అలా సహీహ్ ముస్లిం)

 

అల్లాహ్ తన ఇష్టానుసారం సమయాన్ని, ప్రాంతాన్ని ఎన్నుకొనును

అల్ ఇజ్జ్ ఇబ్నె అబ్దుస్సలామ్ (రహిమహుల్లాహ్) ఇలా తెలిపారు: “సమయాలకు, ప్రాంతాలకు రెండు విధాలుగా ప్రత్యేకత ఇవ్వవచ్చును – ప్రాపంచికంగా లేక ధార్మికంగా. ధార్మికంగా అంటే , ఈ ప్రత్యేక సమయాలలో, ప్రాంతాలలో ప్రతి పుణ్యకార్యానికి అనేక రెట్ల పుణ్యాలను ప్రసాదిస్తూ, అల్లాహ్ తన దాసులపై ప్రత్యేక దీవెనలు కురిపించును. ఉదాహరణకు రమజాన్ మాసపు ఉపవాసాలకు లభించే పుణ్యాలు మిగిలిన సమయాల ఉపవాసాలకు లభించే పుణ్యాల కంటే ఎన్నో రెట్లు అధికమైనవి. అలాగే ఆషూరా దినపు ఉపవాసానికి మిగిలిన నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాల కంటే ఎన్నో రెట్ల పుణ్యాలు లభించును. దీనికి కారణం ఆయా శుభదినాలలో అల్లాహ్ తన ఇష్టానుసారం తన దాసులపై కురిపించే ప్రత్యేక దయాదాక్షిణ్యాలు, కారుణ్యాలు.…” (ఖవాయిద్ అల్ అహ్కామ్, 1/38)

పరదా (ముసుగు) అరబీ పదం ‘హిజాబ్’ అంటే పరదా, ముసుగు వగైరా. ఇది  అల్లాహ్  విధేయతకు సూచన. ఇది స్వచ్చత, వినయము, రుజుమార్గం, విశ్వాసానికి నిదర్శనం...


పరదా (ముసుగు)

అరబీ పదం ‘హిజాబ్’ అంటే పరదా, ముసుగు వగైరా. ఇది అల్లాహ్ విధేయతకు సూచన. ఇది స్వచ్చత, వినయము, రుజుమార్గం, విశ్వాసానికి నిదర్శనంపరిచయం

ఖుర్ఆన్ లో పరదా పురుషులు మరియు స్త్రీలకు అనివార్యం చేయబడింది. ఇస్లాంలో ఇది ముందుగా పురుషులకు, ఆ తర్వాత స్త్రీలకు వర్తిస్తుంది. ఖుర్ఆన్ మరియు హదీసులలో (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం విధానం) సూచించిన విధంగా కేవలం ఒక్క అల్లాహ్ నే ప్రార్దిoచడం తన కర్తవ్యo మరియు అల్లాహ్ యే తాను సృష్టించబడటానికి కారణం అని ప్రతి ముస్లిం భావిస్తాడు. పరదా కూడా అల్లాహ్ కు విధేయత చూపే ఓ మార్గం.

 

“(చూడండి) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారంలోనైనా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికిగానీ, స్త్రీకిగానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త). ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:36   

 

ఖుర్ఆన్ మహిళలకు పరదా ఎందుకు విధించిందంటే దాని వల్ల వారు గౌరవం గల స్త్రీలు అని తెలుస్తుంది మరియు స్త్రీల మానమర్యాదలకు హాని కలిగే అవకాశం ఉండదు. వినయం విశ్వాసానికి చిహ్నం. వినయం, విధేయత, పరదా లేని వారు ధర్మానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. పరదా స్త్రీని కించపరచదు, సరికదా ఆమె మానమర్యాదలను కాపాడుతుంది. పరదా వల్ల స్త్రీలపై గౌరవం పెరుగుతుంది మరియు సమాజంలో శాంతి నెలకొంటుంది. 

 

పురుషుల పరదా


ఖుర్ఆన్ లో అల్లాహ్ సెలవిస్తున్నాడు: (ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. ఖుర్ఆన్ సూరా నూర్ 24:30

 

నామహ్రం (పెళ్లి చేసుకొనే అవకాశం గలవారు)తో కరచాలనం చేయడం


ఇస్లాంలో నామహ్రం తో కరచాలనం చేసే అనుమతి లేదు. దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మీకు అనుమతించబడని (నామహ్రం) స్త్రీలను ముట్టుకోవడం కన్నా మీ తలను ఇనుప సూదితో గుచ్చడం మీకు మేలైనది.” అల్ ముజాం అల్ కబీర్ లో అత్ తబరాని (20/213), అల్ ముసన్నఫ్ లో అబీ శైబహ్ (4/341)

 

స్త్రీల పరదా


 (ఓ ప్రవక్త ! ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గితమై ఉండేది తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణిలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలసి మెలసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు – వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అందచందాలను) కనబడనివ్వకూడదనీ, దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా ! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” ఖుర్ఆన్ సూరా నూర్ 24:31

 

ఓ ప్రవక్తా ! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. సూరా అహజాబ్ 33:59   

 

హదీసు


సఫియా బింత్ శైబహ్ రజిఅల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ఆయిషా రజిఅల్లాహు అన్హా ఇలా అన్నారు: ఈ పదాలు అవతరించినపుడు – “జలాబీబిహిన్నతో అంతా కప్పుకోండి (అంటే- శరీరం, ముఖం, మెడ, చాతీలపై)” – వారు (ఇజార్) ఒక రకమైన బట్ట తీసుకొని దాన్ని అంచుల నుండి కత్తిరించి తమ ముఖాలను కప్పుకున్నారు. సహీహ్ బుఖారీ 4481    

 

పరదా చేసే వయసు


ఆడపిల్లలు యుక్త వయస్సుకు రాగానే పరదా చేయాలి. 

 

 (మగపిల్లలు, ఆడపిల్లలు) యుక్తవయసుకు చేరుకున్నారనడానికి మూడు సూచనలు ఉన్నాయి:

1 – తడి కలలు రావడం

2 – మర్మాంగాల చుట్టూ వెంట్రుకలు రావడం

3 – పద్నాలుగు సంవత్సరాలకు చేరడం

ఆడవారిలో నాలుగో సూచన కూడా ఉంది:

4 – బహిష్టు

ఈ నాలుగింటిలో ఏ ఒకటి కనిపించినా అప్పటి నుండి ఆడపిల్ల తప్పనిసరి పరదా చెయ్యాలి మరియు నిషేధించబడిన వాటి నుండి ఆగాలి.

 

పురుషుల పరదా నిబంధనలు


1.       కనీసం నాభి నుండి కాలి మడమకు దిగకుండా ఉండాలి.  

 

2.       ఇది శరీరానికి చాలా బిగువుగా లేదా శరీరం కనిపించేలా ఉండకూడదు.

 

3.       అది ఎంత వదులుగా ఉండాలంటే శరీరపు ఏ భాగమూ కనిపించకూడదు.

 

4.       అది మగవారి వస్త్రంలా ఉండాలి, ఆడవారి వస్త్రంలా ఉండకూడదు.

 

5.       దాని మీద ఎలాంటి డిజైన్లు ఉండకూడదు, ఎందుకంటే వాటి వల్ల ఆడవారికి ఆకర్షణ పుడుతుంది.

 

6.       అది గర్వానికి, అహంకారానికి ప్రతీక కాకూడదు.

 

7.       అది అవిశ్వాసులను పోలి ఉండరాదు. అవిశ్వాసుల ధర్మానికి ప్రతిబింబించే ఎలాంటి గుర్తులు ఉండకూడదు.

 

స్త్రీల పరదా నిబంధనలు


1.       పూర్తి శరీరాన్ని తల నుండి కాళ్ళవరకు కప్పి ఉంచాలి

 

2.       ఇది శరీరానికి చాలా బిగువుగా లేదా శరీరం కనిపించేలా ఉండకూడదు.

 

3.       అది ఎంత వదులుగా ఉండాలంటే శరీరపు ఏ భాగమూ కనిపించకూడదు.

 

4.       అది ఆడవారి వస్త్రంలా ఉండాలి, మగవారివిలా ఉండకూడదు.

 

5.       దానికి సువాసనలు పూసుకోరాదు. 

 

6.        దాని మీద ఎలాంటి డిజైన్లు ఉండకూడదు, ఎందుకంటే వాటి వల్ల మగవారికి ఆకర్షణ పుడుతుంది.

 

7.        అది గర్వానికి, అహంకారానికి ప్రతీక కాకూడదు.

 

8.        అది అవిశ్వాసులను పోలి ఉండరాదు. అవిశ్వాసుల ధర్మానికి ప్రతిబింబించే ఎలాంటి గుర్తులు ఉండకూడదు.

 

ఇస్లాం స్త్రీలను రక్షిస్తుంది. అoదుకొరకే అల్లాహ్ ఇలాంటి కటినమైన నియమాలను రూపొందించాడు. నేటి సమాజంలో ఆడవారిని చాలామంది మగవారు కేవలం ఆటవస్తువుగా వాడుతున్నారు. ప్రతి ప్రకటనలో స్త్రీలను అర్ధనగ్నంగా చూపిస్తున్నారు. ఇది ఆడవారి స్వేచ్చా లేదా వారిని కించపరచడమా? ఇస్లాం ఆడవారికి అసలైన స్వేచ్చను 1400 సంవత్సరాల క్రితమే ఇచ్చింది.

అల్లాహ్ ముస్లింల దేవుడా అల్లాహ్ ఎవరు అనేక మంది ఆరాధ్యుల్లో నుంచి తమకు నచ్చిన ఒక్కరిని ఎంచుకొని జీవితాంతం ఆయనకే కట్టుబడి ఉండటం కూడా ఏకదైవారాధ...


అల్లాహ్ ముస్లింల దేవుడాఅల్లాహ్ ఎవరు


అనేక మంది ఆరాధ్యుల్లో నుంచి తమకు నచ్చిన ఒక్కరిని ఎంచుకొని జీవితాంతం ఆయనకే కట్టుబడి ఉండటం కూడా ఏకదైవారాధనే అవుతుందని కొందరు అనుకుంటారు. ఇది పెద్ద పొరపాటు. ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే ముందుగా “అల్లాహ్”అనే పదానికి గల అర్ధం ఏమిటో తెలుసుకోవాలి.

 

“అల్లాహ్” అనేది అరబీ భాషా పదం. ఇది “అల్” మరియు “ఇలాహ్” అనే రెండు పదాలు కలసి ఏర్పడింది. అల్ అనేది ఇంగ్లీషులో వాడబడే THE వంటి ఉపపదము - ఆర్టికల్. దీని అర్ధం నిర్దిష్టమైన, నిర్ణీతమైన, ప్రత్యేకమైన, ఇంతకూ ముందు ప్రస్తావించబడిన, ఏకైక మరియు వాస్తవమైన అని.

 

ఇప్పుడు ఈ రెండు పదాలను (అల్ + ఇలాహ్)ను కలిపితే అల్లాహ్ అనే పదం ఏర్పడింది. అదే విధంగా దాని ప్రత్యేక అర్ధం కూడా ఉనికిలోకి వచ్చింది. అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికీ తెలిసిన ఆరాధ్యుడు, ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టిరాశులు, ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే. అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వెళ్ళబుచ్చుతున్నవి మాత్రమే. అంతిమ లక్ష్యం వైపు పయనిస్తున్నవి మాత్రమే.

 

అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు


అల్లాహ్ అంటే ముస్లిముల దైవం, ఇంకో పేరున మరో జాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తున్నది. వారందరి దైవం కూడా ఒక్కడే. ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ విశ్లేషణ దివ్య ఖుర్ఆన్ లో ఇలా ఉన్నది: “మీరు చెప్పండి! ఆయన, అల్లాహ్ అద్వితీయుడు (ఒక్కడే). అల్లాహ్ నిరుపేక్షాపరుడు (ఎవరి ఆధారము, ఎవరి అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే) ఆయనకు సంతానము ఎవరూ లేరు మరియు ఆయన ఎవరి సంతానమూ కాదు ఆయనకు సరిసమానులెవరూ లేరు.” ఖుర్ఆన్ సూరా అల్ ఇఖ్లాస్ 112:1- 4      

 

విశ్వప్రభువుకు అన్ని విధాలా శోభాయమైన పదం ‘అల్లాహ్’


తెలుగులో మనం ‘దేవుడు’ అంటాం. అరబీలో “అల్లాహ్” అంటారు. ఇంగ్లీషులో గాడ్ (God)  అని అంటారు. ఇలా మానవులు ఆరాధ్య దైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు. కాని ఇన్ని పదాల్లోకెల్లా “అల్లాహ్” అనేది ఎంతో విలక్షణమైన పదం. అరబీ భాషలోని అల్లాహ్ అనే పదం విశ్వప్రభువుకు అన్ని విధాలా శోభాయమానమైనదని చెప్పవచ్చు.

 

ఒక అపోహ


ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో “అల్లాహ్” అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. ముస్లింలు, క్రైస్తవుల యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలా మంది అనుకుంటారు. కాని నిజానికి ఇదంతా ఓ అపోహ మాత్రమే. ఎందుకంటే “అల్లాహ్” అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ ఒక్కడే.

 

దేవుడు ఎవరు? ఆయన అస్తిత్వం ఏమిటి? అనే విషయాల్లో యూదులు - క్రైస్తవులు - ముస్లింల మధ్య భేదాభిప్రాయాలున్నాయి, ఉదాహరణకు: యూదులు క్రైస్తవుల్లో ఉన్న త్రిత్వ భావనను (Trinity)  తిరస్కరిస్తారు. ముస్లింలు కూడా త్రిత్వ భావనను (Trinity) తిరస్కరిస్తారు. అంతమాత్రం చేత ఆ మూడు మతాలకు ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు ఉన్నారని అర్ధం కాదు. ఎందుకంటే - విశ్వమంతటికి నిజదేవుడు ఒక్కడే. ఇస్లాం చెప్పేది ఏమిటంటే - ఇతర మతాల వాళ్ళు కూడా అల్లాహ్ నే విశ్వసిస్తున్నారు. కాని అల్లాహ్ ను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించటం లేదు. దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకొని విశ్వసిస్తున్నారు.

  మస్జిద్ ఎ ఖుబా - MASJID E QUBA అల్లాహ్ ను ఆరాధించే చోటును (కట్టడాన్ని) మస్జిద్ అంటారు. ఇస్లామీయ చరిత్రలో మస్జిద్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ...

 

మస్జిద్ ఎ ఖుబా - MASJID E QUBA


అల్లాహ్ ను ఆరాధించే చోటును (కట్టడాన్ని) మస్జిద్ అంటారు. ఇస్లామీయ చరిత్రలో మస్జిద్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. మస్జిద్ సమాజానికి కేంద్ర బిందువుగా  వుంటుంది. అంతే కాక దాని  వల్ల చుట్టుప్రక్కల ఊళ్లు ఏర్పడుతాయి. ప్రస్తుత కాలంలో ప్రత్యేకంగా ముస్లిం దేశాలలో ప్రతి వీధికి ఒక మస్జిద్ కనపడుతుంది. దీని వల్ల ముస్లింలకు ఐదు పూటల నమాజు చేయడానికి చాలా సౌకర్యం కలుగుతుంది.   

 

ప్రతి మస్జిద్ లో ఒక “మిహ్రాబ్”(ప్రత్యేక స్థానం) ఉంటుంది. అది మక్కా దిశను సూచిస్తుంది. ముస్లింలు నమాజ్ ఆ దిశ వైపే చేస్తారు. సాధారణంగా ప్రతి మస్జిద్ లో (మింబర్) ఒక వేదిక ఉంటుంది. దానిపై నిలబడి ఇస్లామీయ విద్వాంసులు ముస్లింలకు సంబోధిస్తారు (ఉపన్యసిస్తారు). 

చరిత్ర

మదీనాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొట్ట మొదట నిర్మించిన మస్జిద్, మస్జిదె ఖుబా.

 

ఇబ్నుల్ ఖయ్యిం (రహి) ప్రకారం (జాద్ అల్ మాద్ 3/58)లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాలో ప్రవేశించిన సందర్భాన్ని వివరిస్తూ:

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రాకపై సంతోషపడుతూ, ముస్లింలు తక్బీర్ (అల్లాహు అక్బర్) చెబుతూ, ఆయనను కలవడానికి వెళ్లారు... దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుబా వరకు వెళ్లి బనూ అమ్ర్ ఇబ్న్ ఔఫ్ వద్ద ఆగారు. వారి మధ్య దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పద్నాలుగు రోజులు ఆగారు. అప్పుడే ఖుబా మస్జిద్ ను స్థాపించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడ్డాక స్థాపించిన మొదటి మస్జిద్ ఇది.    

 

ప్రఖ్యాత ఇస్లామీయ విద్వాంసులు ముహమ్మద్ అల్ అమీన్ అల్ శంఖీతి (రహి) ఇలా అన్నారు: ప్రజానికానికి నిర్మించబడ్డ మస్జిద్ లలో, మొట్ట మొదటి మస్జిద్, మస్జిదె హరాం.  ముస్లింల ద్వారా నిర్మించబడ్డ మొదటి మస్జిద్, మస్జిదె ఖుబా. మస్జిదుల్ హరాం ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా నిర్మించబడ్డది. మస్జిదె ఖుబా అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నిర్మితమయింది. మస్జిదె హరాం ప్రదేశాన్ని అల్లాహ్ నిర్ణయించాడు.  

 

ప్రదేశం

ఇది మదీనాకు (సౌదీ అరేబియా) దక్షిణ దిశలో ఉంది. దీని ఆకృతి ప్రస్తుత కాలానిది. పాత కాలపు కట్టడం ఏది ఇప్పుడు కానరాదు.   

 

విస్తరణ

ముస్లింలు ఖుబా మస్జిద్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ముందుగా ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (రజి), ఆ తరువాత ఉమర్ ఇబ్న్ అబ్ద్ అల్ అజీజ్ (రజి) ఈ మస్జిద్ ను పునరుద్ధరించారు. ఇతర ఖలీఫాలు కూడా దీన్ని పునరుద్ధరించారు. దీని ఆఖరి పునరుద్ధరణ 1406 AH లో జరిగింది.  

 

555 AH సంవత్సరంలో కమాలు ద్దీన్ అల్ ఇస్ఫహాని ఈ మస్జిద్ కు అనేక విధాలుగా తీర్చిదిద్దారు. ఆ తరువాత 671, 733, 840, 881 AH లలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. సుల్తాన్ అబ్దుల్ మాజిద్ కాలంలో (1245 AH) దీని తాజా పునరుద్ధరణ జరిగింది.  

 

ప్రస్తుత కాలంలో సౌదీ ప్రభుత్వం (హజ్ కార్యకలాపాలు చూసే సంస్థ) ఈ మస్జిద్ బాధ్యతలను తీసుకోని పాత కట్టడంలో ఎన్నో కొత్త మార్పులు చేసింది. ఇందులో 20 వేల కంటే ఎక్కువ మంది నమాజ్ చేసే అవకాశం ఉంది. 1984 లో సౌదీ రాజు ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ దీని విస్తరణకు పునాది వేశారు. రెండు సంవత్సరాల తరువాత విస్తరణ పూర్తి అయ్యాక, ఆయనే దీన్ని శంకు స్థాపన చేశారు.  

 

ప్రాంతం

నమాజ్ చదివే ప్రాంతం 5035 స్క్వేర్ మీటర్లు గలదు. మస్జిద్ పూర్తి స్థలం అన్ని సదుపాయాలతో కలిపి 13,500 స్క్వేర్ మీటర్లు ఉంది.  

 

మస్జిద్ ప్రాంగణంలో ఎన్నో ద్వారాలు ఉండేవి. ఉత్తర ద్వారం స్త్రీల కోసం ప్రత్యేకించబడింది. ఈ మస్జిద్ కు నాలుగు మినార్లు ఉన్నాయి. 56 గోపురాలు ఉన్నాయి. మస్జిద్ కు ఆనుకొని ఇమాం మరియు ముఅజ్జిన్ ల ఇళ్ళు, ఓ గ్రంథాలయం, రక్షక భటుల నివాస స్థలాలు ఉన్నాయి. ఇవి 112 స్క్వేర్ మీటర్ ల స్థలంలో ఉన్నాయి. వాణిజ్య కేంద్రంలో 450 స్క్వేర్ మీటర్లలో 12 దుకాణాలు ఉన్నాయి. మస్జిద్ కు 7 ముఖ ద్వారాలు మరియు 12 అనుబంధ ద్వారాలు ఉన్నాయి.     

 

ఈ మస్జిద్ లో పురుషుల కొరకు 64 మరియు స్త్రీల కోసం 32 మరుగుదొడ్లు కలవు. 42 వుజూ స్థానాలు కలవు. మస్జిద్ లో చల్లదనం కోసం మూడు సెంట్రల్ ఏసీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏసీ ఒక మిలియన్ ఎనభై వేల థర్మల్ యూనిట్ల సామర్ధ్యం గలది. ఖుబా మస్జిద్ ఓ మైలురాయి లాంటిది. దీని తెల్ల కట్టడం చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. 

 

ఖుర్ఆన్

అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను మస్జిదె ఖుబాలో ప్రార్ధించండని ప్రోత్సహించారు. ఎందుకంటే, ఈ మస్జిద్ భయభక్తుల పునాదిపై నిర్మించబడింది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.” (ఖుర్ఆన్ సూరా తౌబా 9:108)

 

హదీస్

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే తన ఇంట్లో పరిశుద్ధులై, ఖుబా మస్జిద్ లో నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రా చేసినంత ప్రతిఫలం లభిస్తుంది.” (సునన్ ఇబ్న్ మాజా 1476, 1477 & జామి అత్ తిర్మిజి 324)

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నడుస్తూ లేదా స్వారి చేస్తూ ప్రతి శనివారం మస్జిదె ఖుబాకు వెళ్ళేవారు. అక్కడ రెండు రకాతులు నమాజ్ చేసేవారు. (సహీహ్ బుఖారీ vol 2:1191, 1192 & సహీహ్ ముస్లిం 1399)

 

మస్జిదె ఖుబాను సందర్శించడం మరియు నమాజ్ చేయడం సున్నత్

మదీనాకు వెళ్ళే వారు, అక్కడ నివసించే వారు మస్జిదె ఖుబాకు వెళ్ళడం మరియు అక్కడ నమాజ్ చేయడం వల్ల సున్నత్ ను పాటించిన మరియు ఉమ్రా చేసిన ప్రతిఫలం లభిస్తుంది. సహల్ ఇబ్న్ హనీఫ్ ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే ఈ మస్జిద్ – అంటే మస్జిదె ఖుబా – కు వచ్చి నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రాకు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది.” (ముస్నద్ అహ్మద్ 3/437; అల్ నసాయి 699; షేక్ అల్బాని గారు దీన్ని సహీహ్ అల్ తర్ఘీబ్ 1180,1181 లో ధృవీకరించారు).

 

సహీహ్ బుఖారిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రతి శనివారం కాలినడకన లేదా స్వారీపై మస్జిదె ఖుబాకు వెళ్లి, రెండు రకాతుల నమాజ్ చేసేవారు అని ఉంది. (సహీహ్ బుఖారీ 1191, సహీహ్ ముస్లిం 1399) 

 

ఇంకా చూడండి

Masjid ; Masjid E Aqsa; Masjid E Haram; Masjid E Nabwi; Makkah; Madina; Expansion of Masjid Al Haram; Allah; Messenger of Allah;
మస్జిద్; మస్జిదె హరమ్; మస్జిదె నబవి; మక్కా; మదీనా; అల్లాహ్; దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం;

  మదీనా – మస్జిదె నబవీ పూర్వం మదీనా నగరం ‘యస్రిబ్’గా పిలువబడేది.మక్కా నుండి హిజ్రత్ చేసిన తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈ నగరంలో...

 

మదీనా – మస్జిదె నబవీ

పూర్వం మదీనా నగరం ‘యస్రిబ్’గా పిలువబడేది.మక్కా నుండి హిజ్రత్ చేసిన తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈ నగరంలో స్థిరపడ్డారు. తన ఇంటి పక్కనే ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం నిర్మించిన మస్జిద్ ‘మస్జిదె నబవీ’(ప్రవక్త మస్జిదు)గా, ప్రసిద్దిచెందింది. మదీనా నగరం హరమె నబవీ సల్లల్లాహు అలైహివ సల్లం గా, దారుల్ హిజ్రత్ గా ఖ్యాతి చెం దింది. ఇంకా ఇది దైవాజ్ఞలు అవతరించిన కేంద్రంగా భాసిల్లింది. దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను పవిత్ర స్థలంగా ఖరారు చేసినట్లే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనా నగరాన్ని పుణ్యక్షేత్రంగా ఖరారు చేశారు. ఆయన  సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు:


“ఓ అల్లాహ్! ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను పవిత్ర స్థలం (హారం)గా ఖరారు చేశారు. నేను ఈ నగరం (మదీనా)లోని రెండు రాతి ప్రదేశాల నడుమ భాగాన్ని పుణ్య క్షేత్రంగా ఖరారు చేస్తున్నాను.” (సహీహ్ ముస్లిం)   

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవచనం

“పాము తన పుట్టలో శరణు పొందినట్లే విశ్వాసం (ఈమాన్) మదీనాలో శరణు పొందుతుంది. ఇక్కడి వైపరీత్యాలను, బాధలను ఓర్చుకున్న వాని కోసం నేను సిఫారసు చేస్తాను, సాక్షిగా ఉంటాను.” (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)


ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇంకా ఇలా వక్కాణించారు:


“మదీనా కొలిమి లాంటిది. అది తన వారిలోని తప్పును దూరం చేస్తుంది. అందులోని మంచివారు మరింత నికార్సుగా తేలుతారు.” (సహీహ్ ముస్లిం)


మదీనా వాసుల గొప్పతనం

మదీనాలో నివసించే వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కు ఇరుగు పొరుగు వారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం  మస్జిదుకు వచ్చేవారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం నగరంలో స్థిరపడేవారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పుణ్య క్షేత్రంలో నిలకడ చూపేవారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెలిగించిన దీపాలకు రక్షకులు. అలాంటి వారిని ఆదరించాలి. వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. వారిని అభిమానించాలి. వారితో స్నేహ బంధాలను కలిగి ఉండాలి. వారికీ మనస్తాపం కలిగించకూడదు. వారిని బాధించే వారిని హెచ్చరిస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
“మదీనా వాసులను మోసగించేవాడు నీటిలో ఉప్పు కరిగే విధంగా కరిగిపోతాడు.” (సహీహ్ బుఖారీ)



మదీనా వాసుల పట్ల సద్వ్యవహారం చేయమని  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యావత్తు అనుచరులను తాకీదు చేస్తూ ఇలా అన్నారు: “మదీనా నా వలస కేంద్రం. ఇదే నా విరామ స్థలం. నా పునరుత్థానం ఇక్కడి నుంచే జరుగుతుంది. నా పొరుగువారు ఘోర అపరాధాలకు ఒడిగట్టకుండా ఉన్నంత వరకూ వారిని రక్షించవలసిన బాధ్యత నా అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉంది. ఎవరైతే వారిని రక్షిస్తారో వారి కొరకు నేను సిఫారసు చేస్తాను, సాక్షిగా ఉంటాను.” (తిబ్రానీ)  

 

మస్జిదె నబవీ గొప్పతనం

భూమండలంలోని మూడు గొప్ప మస్జిదులలో మస్జిదె నబవీ ఒకటి. దీని మహత్తును స్పష్టపరుస్తూ అంతిమ  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు:

 

  1. “నా ఈ మస్జిద్ లో నమాజు  చేయటం – ఒక మస్జిద్ హరం తప్పించి – వేరితర మస్జిద్ లలో చేసే వెయ్యి నమాజులకన్నా ఘనమైనది.” (ముస్నద్ అహ్మద్)  
  2. “మస్జిదె హరంలో నమాజు చేయటం వేరితర మస్జిద్ లలో చేసే లక్ష నమాజులకన్నా శ్రేష్టమైనది.” (ముస్నద్ అహ్మద్)
  3. “మూడు మస్జిద్ లు తప్ప మరో దాని వైపు పుణ్యఫలాపేక్షతో వాహనాలను సిద్ధరపరచరాదు. అవేమంటే – 1. మస్జిదె హరం  2. మస్జిదె నబవీ 3. మస్జిదె అఖ్సా .”
  4. “నా నివాస గృహానికి – (ఈ మస్జిద్ లోని) నా వేదిక (మిoబర్)కి మధ్య ఉన్న స్థలం స్వర్గ వనాలలోని ఒక వనం.” (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)   

 

Popular Posts